పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం

మృతులను రెంటచింతలకు చెందినవారిగా గుర్తించారు. రెంటచింతల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన దాదాపు 38 మంది శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు.

Update: 2022-05-30 02:20 GMT

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి రెంట చింతలకు వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మంది మరణించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను రెంటచింతలకు చెందినవారిగా గుర్తించారు. రెంటచింతల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన దాదాపు 38 మంది శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం (మే 29) రాత్రి తిరుగు పయమనమయ్యారు. వీరంతా టాటా ఏస్ వాహనంలో కిక్కిరిసి ప్రయాణించారు. వాహనం రాత్రి 11.50 గం. సమయంలో రెంట చింతల సబ్‌స్టేషన్‌ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సబ్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న ఓ సిమెంట్ లారీని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.

వేగంగా ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను అన్నవరపు కోటమ్మ (70), పులిపాడు కోటేశ్వరమ్మ (60), నారాయణపురం రోశమ్మ (70), మక్కెన రమణ (50), కురిసేటి రమాదేవి (50), పెద్దారపు లక్ష్మీనారాయణ (32)గా గుర్తించారు. రెంటచింతల సబ్ స్టేషన్ సమీపంలో అంతా చీకటిగా ఉండటంతో.. అక్కడ నిలిపి వున్న లారీని డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


Tags:    

Similar News