Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 31 కంపార్ట్‌మెంట్లలో
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈరోజు దుర్గాష్టమి కావడంతో పాటు దసరా సెలవులు కూడా ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారు. దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఇక వాహన సేవలు కూడా ఉండటంతో వాటిని చూసి భక్త జనం తరలించిపోతున్నారు. మాడ వీధుల్లో భక్తులు శ్రీవారి సేవలను వీక్షిస్తున్నారు. వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తజనాన్ని మరింతగా ఆకట్టుకుంటున్నాయి. రంగురంగుల అలంకారలతో ఆలయాన్ని తీర్చిదిద్దారు. చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లు బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో అశేష భక్తజనం వాహనసేవలతో పాటు స్వామి వారిని చూసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తులు కనిపిస్తున్నారు.
ఎనిమిది గంటలు...
భక్త జనంతో కిటకిటలాడిపోతుంది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం సూర్య ప్రభవాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చాు.రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమివ్వనున్నారు. ఈరోజు తిరుమలలోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,753 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,623 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. దసరా పండగ కావడంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.