Tirumala : తిరుమలలో నేటి రద్దీ ఎంత ఉందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు;

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి కనిపిస్తున్నారు. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. వరసగా సెలవులు రావడంతో పాటు పరీక్షలు ముగియడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు శుభకార్యాలు నిర్వహించుకున్న వారు సయితం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
వేసవి కాలంలో ఎక్కువ రద్దీ...
సాధారణంగా ఏప్రిల్ నెల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేసవి సెలవులు పిల్లలకు ఇవ్వడంతో పాటు పరీక్షలు పూర్తికావడంతో పాటు మొక్కులు చెల్లించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వేసవిలో సహజంగానే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు వసతి గృహాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదం వద్ద ఇబ్బందులు పడకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యా కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,007 మంది దర్శించుకున్నారు. వీరిలో 27, 440 మంది తమ తలనీలలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.04 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.