Tirumala : తిరుమలలో నేడు రద్దీ ఎలా ఉందంటే.. మీరు నమ్మరు ఇది నిజం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలలో ఉన్నారు

Update: 2024-10-14 02:52 GMT

tirumala darshan 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలలో ఉన్నారు. దసరా సెలవులు ముగిసినప్పటికీ బ్రహ్మోత్సవాలు పూర్తయినప్పటికీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కంపార్ట్‌మెంట్లలో ఎక్కువగా భక్తులు నిండిపోయి ఉన్నాయి. బయట వరకూ క్యూ లైన్ ఈరోజు లేదు కాని ఎక్కువ కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా సోమవారం నుంచి గురువారం వరకూ రద్దీ తక్కువగా ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలు మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముంది. అందుకే ఆ మూడు రోజులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్ధం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సంప్రదాయంగా వస్తుంది. కానీ ఈరోజు కూడా తిరుమలలో రద్దీ కొనసాగుతుంది.

పన్నెండు గంటల పాటు...
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన రావడంతో ఇక్కడి నుంచి భక్తుల సంఖ్య తక్కువగానే ఉందని, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశముంది. నిన్న తిరుమల శ్రీవారిని 86,900 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,739 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.56 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News