Tirumala : తిరుమలలో రద్దీ ఈరోజు ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు;

Update: 2025-01-02 02:51 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. నూతన సంవత్సరం తొలి వారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలను దర్శించుకుని ఏడుకొండల వాడి చెంత తమ మొక్కులు తీర్చుకుంటే శుభప్రదమని భావిస్తున్నారు. అందుకే నిన్నటి నుంచే భక్తుల తాకిడి తిరుమలలో ఎక్కువగా ఉంది. అందుకు తగినట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీల నుంచి సామాన్యుల వరకూ తిరుమలకు చేరుకుని వైకుంఠ వాసుడి చెంత మోకరిల్లుతున్నారు. దీంతో తిరుమల వీధులన్నీభక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. మాడ వీధులన్నీ కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే కనపడుతున్నారు. జనవరి నెల మొదటి వారం కావడంతో పాటు సెలవులు లేకపోయినా సరే శ్రీవారిని సందర్శించుకునేందుకు ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు రెండు గంటల్లోగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. క్యూ లైన్ పెద్దగా వేచి ఉండకుండానే సులువుగా దర్శనం చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను తాము చేస్తున్నామని, భక్తులు కూడా అందుకు సహకరించాలని కోరుతున్నారు.

మూడు కంపార్ట్ మెంట్లలో...
తిరుమలకు ఎప్పుడూ భక్తుల తాకిడి ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా, వారాలతో నిమిత్తం లేకుండా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు వచ్చి బారులు తీరతారు. అందులో ముందుగా దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే వారు కొందరైతే, అప్పటికప్పడు వచ్చే వారుకూడా ఉంటారు. అందరికీ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,630 మంది దర్శించుకున్నారు. వీరిలో 18,965 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News