పార్టీ మారిన యార్లగడ్డ.. స్పందించిన సజ్జల
గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు సంచలన ప్రకటన చేశారు. తాను వైసీపీ
గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు సంచలన ప్రకటన చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ కోరుతున్నానని.. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే టిక్కెట్ ఇవ్వాలని కోరారు. శుక్రవారం విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ తాను గడపగడపకూ తిరిగి వైసీపీని పటిష్ఠం చేస్తే ఉంటే ఉండు పోతే పో అన్నారని తెలిసిందని అన్నారు. ఈ మాటలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. యార్లగడ్డ పార్టీ కోసం పని చేశారని, కానీ టిక్కెట్ ఇవ్వలేకపోయామని సజ్జల ఒక్క మాట చెబితే బాగుండేదని, కానీ అలా జరగలేదన్నారు. తనకు పార్టీలో ఏ పదవి ఇవ్వకపోయినప్పటికీ అసలైన కార్యకర్తలు ఇప్పటికీ తనతోనే ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో గెలుపు అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, ఓటమి అన్ని సమస్యలకు కారణమవుతుందన్నారు. తనకు ఏ పదవి లేదని, దీంతో తన వెంట ఉన్నవారికి ఏమీ చేయలేకపోయానని, ఇందుకు అందరికీ క్షమాపణ చెబుతున్నానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తనకు ఇలా జరిగి ఉండేది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారన్నారు. తాను పార్టీని టిక్కెట్ తప్ప ఏమీ అడగలేదన్నారు.