దొంగతనం చేసి దబాయించినట్లుగా చంద్రబాబు తీరు: సజ్జల
దొంగతనం చేసి దబాయించినట్లుగా చంద్రబాబు తీరు ఉందని
దొంగతనం చేసి దబాయించినట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నాడా? లేదా? తేల్చాల్సింది వైసీపీ కాదని, ఐటీ శాఖ అన్నారు. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పకుండా తనను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలకు గాను ఇప్పటికే ఈడీ ఆయనను విచారించి అరెస్ట్ చేయాల్సిందని, కానీ ఇంతకాలం చూస్తూ ఎందుకు ఊరుకుందో అర్థం కావడం లేదన్నారు. ముడుపులన్నీ చంద్రబాబు గూటికే చేరాయని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందని అన్నారు. పాపం పండినప్పుడు అరెస్ట్ కావడం ఖాయమని, చంద్రబాబు తానేదో నిప్పులాంటి వ్యక్తిని అని చెబుతారని, కానీ ఆయన తుప్పులాంటి వ్యక్తి అని అన్నారు. తాను చట్టానికి అతీతుడు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఇది బరితెగింపే అవుతుందన్నారు. ఐటీ నోటీసుల అంశంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆమె తీరులో మరిదిని రక్షించాలనే ఎత్తుగడ కనిపిస్తోందన్నారు.
నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. కొద్దిరోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తనపై కూడా దాడి చేస్తారని.. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని.. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.