ఏపీ వైపు దూసుకొస్తున్న అసని.. భారీ వర్షాలు !
తుపాను కారణంగా తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా..
విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను తీవ్ర తుపానుగా.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఏపీ వైపు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ.. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. రేపట్నుంచి ఏపీ, ఉత్తర కోస్తాంధ్రపై అసని ప్రభావం చూపనుందని, రేపు సాయంత్రం నుంచి బుధవారం వరకూ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
తుపాను కారణంగా తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మే 12 గురువారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. రానున్న 36 గంటల్లో అసని ప్రభావం తీవ్రంగా ఉండనుందని హెచ్చరించింది. భారీ వర్షసూచన నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. మే 10 నాటికి ఉత్తరాంధ్ర తీరాన్ని సమీపించనున్న అసని.. ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.