Indrakiladri : నేడు రెండు రూపాల్లో దుర్గాదేవి
ఇంద్రకీలాద్రిపై నేటితో దసరా శరన్నవరాత్రులు ముగియనున్నాయి. ఈరోజు రెండు రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో దసరా శరన్నవరాత్రులు ముగియనున్నాయి. ఈరోజు రెండు రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసుర మర్దనిగా, మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. దసరా పండగ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తెప్పోత్సవం...
సాయంత్రం కృష్ణా నదిలో దుర్గమల్లేశ్వర తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే తెప్పోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవం కన్నుల పండవగా జరగనుంది. నవరాత్రుల్లో లక్షల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారని పాలకమండలి తెలిపింది. అలాగే భవానీ భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. మరో రెండు రోజుల పాటు భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.