ఏప్రిల్ 3న విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా ఉడుమల బాల ప్రతిష్ఠాపన.. వైజాగ్ కి రానున్న వాటికన్ అంబాసిడర్

హైదరాబాద్ లోని రామంతపూర్ లోని సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో;

Update: 2025-04-02 11:36 GMT
ఏప్రిల్ 3న విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా ఉడుమల బాల ప్రతిష్ఠాపన.. వైజాగ్ కి రానున్న వాటికన్ అంబాసిడర్
  • whatsapp icon

విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా డాక్టర్ ఉడుమల బాల ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పవిత్ర ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగా వైభవంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కొన్ని వేల మంది క్రైస్తవులు హాజరుకానున్నారు. విశాఖపట్నంలోని జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ గ్రౌండ్స్‌ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశాఖపట్నం రోమన్ క్యాథలిక్ అగ్ర పీఠానికి ఉడుముల బాలను అగ్ర పీఠాధిపతిగా ప్రతిష్టాపన చేయనున్నారు.




 

ఈ క్రైస్తవ దివ్య పూజా వేడుకకు పోప్ ఫ్రాన్సిస్ ప్రతినిధి, భారత్- నేపాల్ అపోస్టోలిక్ నున్సియో(అంబాసిడర్), ప్రాతినిధ్యం వహిస్తున్న మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని పలు చర్చిలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు, వీరిలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్, మోస్ట్ రెవరెండ్ కార్డినల్ ఆంథోనీ పూలా ఈ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. బొంబాయి ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఓస్వాల్డ్ కార్డినల్ గ్రేసియస్ ప్రధాన ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్చ్ బిషప్‌లు, బిషప్‌లు, ప్రొవిన్షియల్ సుపీరియర్లు, ప్రీస్ట్స్, మతాధికారులు, ప్రజలు కూడా హాజరవుతారు. ఆర్చ్ బిషప్ బాల నాయకత్వంలో కోస్తాంధ్రలో జరిగే ఈ గొప్ప ప్రార్ధనా వేడుక, ఆ తరువాత సత్కారం, ఉత్సవాలు సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.



 


275 ఏళ్ల ఘన చరిత్ర: విశాఖపట్నం ఆర్చ్ డయసిస్(అగ్ర పీఠం) చరిత్ర
భారతదేశంలో క్రైస్తవ మతం మూలాలు 2000 ఏళ్ల క్రితం నాడే ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ఏసు క్రీస్తు ప్రధాన శిష్యుడైన సెయింట్ థామస్, సెయింట్ బార్తలోమియా క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో ఉపఖండానికి సువార్తను తీసుకువచ్చారు. శతాబ్దాల మిషనరీల కార్యక్రమాలు, మతసంబంధమైన నిబద్ధత ద్వారా ఈ విశ్వాస విత్తనాలు వృద్ధి చెందాయి. దక్షిణ భారతదేశంలో, పోర్చుగీస్ పద్రోడో వ్యవస్థ, 17వ శతాబ్దపు క్రైస్తవ మిషనరీలు సువార్త ప్రచార ప్రయత్నాలను అధికారికంగా నిర్వహించడానికి వీలు కల్పించాయి.
1845లో స్థాపించిన విశాఖపట్నం ప్రో-వికారియేట్ మొదట మొత్తం మధ్య భారతదేశంలో భాగంగా ఉంది. 1850లో వికారియేట్ అపోస్టోలిక్ హోదాకు, 1886లో డయోసిస్‌గా, చివరకు 2001లో ఆర్చ్‌డియోసెస్‌గా మారింది. గత 175 సంవత్సరాలలో, ఆర్చ్‌డియోసెస్ 83 పారిష్‌లు, మిషన్ స్టేషన్‌లను కలిగి ఉంది, వీటిలో 90 మంది డయసిస్ ప్రీస్టులు పని చేస్తున్నారు. అనేక మంది మతగురువులు, నన్స్ ఇందులో భాగంగా సేవలందిస్తున్నారు.
బిషప్ లు(పీఠాధిపతుల) మార్గదర్శకత్వంలో, నిబద్ధత కలిగిన సామాన్యుల ద్వారా తగిన శక్తిని పొందుతూ ఆర్చ్‌డియోసెస్ చర్చిలు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎంతో మందికి కావాల్సిన తోడ్పాటును అందిస్తూ ఉంది. తెలుగు మాట్లాడే వ్యక్తుల కోసం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక, సామాజిక శక్తికి తోడ్పాటును అందిస్తూ ఉంది. ప్రస్తుత క్షణం ఈ చారిత్రాత్మక ప్రయాణంలో ఓ భాగం. ఆర్చ్ బిషప్ బాల నాయకత్వంలో కొత్త శకం ప్రారంభాన్ని సూచిస్తుంది.

నమ్మకంతో ముందుకు సాగుతూ: ఆర్చ్ బిషప్ ఉడుమల బాల చరిత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరంగల్ లోని గూడూరు గ్రామంలో జూన్ 18, 1954న జన్మించారు డాక్టర్ ఉడుమల బాల. కాథలిక్ కుటుంబం నుండి వచ్చారు. ఎనిమిది మంది తోబుట్టువులలో ఆయన ఒకరు. ఆయన అక్కచెల్లెళ్లలో ఇద్దరు నన్స్ గా ఉన్నారు. వరంగల్ లోని ఫాతిమా నగర్ లోని సెయింట్ పయస్ X మైనర్ సెమినరీలో ఆయన తన అర్చక శిక్షణను ప్రారంభించారు, తరువాత హైదరాబాద్ లోని రామంతపూర్ లోని సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో థియోలాజికల్ స్టడీస్ ను పూర్తి చేశారు. ఫిబ్రవరి 20, 1979న ఆయన ప్రీస్ట్(మత గురువు)గా నియమితులయ్యారు.



 

1979 నుండి 1986 వరకు ఆయన మతసంబంధ పరిచర్య ప్రారంభ సంవత్సరాలు. ప్రజలతో మమేకమవుతూ గడిపారు. ఆ తరువాత ఆయన వివిధ పరిపాలనా బాధ్యతలను చూసుకున్నారు. సెయింట్ జాన్స్ సెమినరీలో కోశాధికారిగా, తరువాత 1994 నుండి 2006 వరకు అక్కడే రెక్టర్‌గా పనిచేశారు. ఆయన విద్యాపరమైన పనులు ఆయనను రోమ్‌కు తీసుకెళ్లాయి, అక్కడ ఆయన క్రైస్తవ నీతిశాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేశారు.
భారతీయ చర్చి విభాగంలో గుర్తింపు పొందిన నాయకులైన ఆర్చ్ బిషప్ బాల CCBI డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా (2006–2013), ఆ తరువాత CCBI కమిషన్ ఫర్ వొకేషన్స్, సెమినరీస్, క్లర్జీ అండ్ రిలిజియస్ (2015–2023) ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన 2013లో వరంగల్ బిషప్‌గా నియమితులయ్యారు. 2022 నుండి 2024 వరకు ఖమ్మం అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 8, 2025న, పోప్ ఫ్రాన్సిస్ ఆయనను విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా నియమించారు. ఆయన అనేక నాయకత్వ బాధ్యతలు ఇప్పటి వరకూ చేపట్టి ప్రశంసలు అందుకున్నారు.



 

విశాఖపట్నం అగ్రపీఠాధిపతి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు: ప్రోగ్రామ్ హైలైట్స్
క్రైస్తవ సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు ఏప్రిల్ 3, 2025 గురువారం సాయంత్రం 4:00 గంటలకు మొదలవ్వనున్నాయి. వాల్తేర్ ఆర్.ఎస్.లోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ గ్రౌండ్స్‌లో గ్రూప్ ఫోటోగ్రాఫ్, తరువాత సెయింట్ పీటర్స్ కేథడ్రల్ గ్రౌండ్స్‌కు ఊరేగింపుగా వెళ్లనున్నారు. దివ్యపూజ వేడుక సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది, సాయంత్రం 7:00 గంటలకు అభినందనలు పూర్తవనున్నాయి.


Similar News