Andhra Pradesh : రూటు మార్చిన మీడియా.. మొన్నటి వరకూ జగన్ కు జేజేలు.. నేడు బాబుకు బాజా

నిన్నటి వరకూ వైసీపీకి భజన చేసిన కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు చంద్రబాబు నామస్మరణ అందుకున్నాయి.

Update: 2024-06-06 13:44 GMT

గెలుపోటములు ఎవరికైనా సహజం. గెలుపు ఎంత వాస్తవమో.. ఓటమి కూడా అంతే సహజం. అయితే ఇప్పుడు మీడియా పరిస్థితి చూస్తుంటే నవ్వొస్తుంది. నిన్న మొన్నటి వరకూ అధికారంలో ఉన్న వైసీపీకి భజన చేసిన కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని పక్కన పెట్టి ఇప్పుడు చంద్రబాబు నామస్మరణ అందుకున్నాయి. చంద్రబాబుకు ఐదేళ్ల పాటు అసలు కవరేజీ కూడా ఇవ్వని మీడియా ఇప్పుడు చంద్రబాబు ప్రతి కదలికను తమ కెమెరాలో బంధించి ప్రసారం చేసేందుకు తహతహలాడుతున్నాయి. జర్నలిజం అంటే నిఖార్సుగా ఉండాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పగలగాలి. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం తెలుగు మీడియాకు అలవాటుగా మారింది.

వ్యాపార సంస్థలుగా...
ఆంధ్రప్రదేశ్ లో మీడియా సంస్థలు ఫక్తు వ్యాపార సంస్థలుగా మారాయి. ఏదో ఒక పార్టీని వెంటేసుకుని తిరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము మద్దతిచ్చే పార్టీవైపే నిలబడుతూ వస్తున్నాయి. గత ఐదేళ్లలో కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అధికారంలో లేకపోయినా ఆయన వెంట నిలిచాయి. జగన్ ప్రభుత్వంపై అప్పట్లో విమర్శలు చేస్తూ వచ్చాయి. మొత్తం మీద వాటి ప్రభావం ఎంతో తెలియదు కానీ జగన్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయింది. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం జగన్ ను అంటిపెట్టుకుని తిరిగాయి. జగన్ తప్ప మరేమాట ఆ మీడియా సంస్థల్లో ివినిపించేది కాదు.
ఒక్కరోజులోనే...
అలాంటిది ఒక్క రోజులో సీన్ మారిపోయింది. ప్రధాన మీడియా సంస్థలు కొన్ని ఇప్పుడు జగన్ ను వదిలేసి... ఆ పార్టీ ఓటమికి తప్పొప్పులను వెదికే పనిలో పడ్డాయి. అంతే కాదు. జగన్ అధికారంలో ఉండగా వీరుడు.. శూరుడు విక్రమార్కుడు అంటూ పొగిడిన సంస్థలు ఇప్పుడు ప్లేటు మార్చేశాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కనపడని తప్పులు.. పొరపాట్టు ఇప్పుడు జూమ్ వేసి మరీ చూపిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆయన ప్రాపకం పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మొన్నటి వరకూ ఆ మీడియా సంస్థలకు తెలుగుదేశం పార్టీ నేతలే వెళ్లవద్దని ఆ పార్టీ ఆంక్షలు విధించిందంటే వాటిపై ఎంత ముద్ర పడిందో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడంతో చూసే జనం కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.



Tags:    

Similar News