అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
తెలుగుదేశం పార్టీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు
తెలుగుదేశం పార్టీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. మూడో రోజు కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. పదే పదే సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండటంతో స్పీకర్ సస్పెండ్ చేశారు. రైతు సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ఉన్నారు. సభలో పదే పదే అడ్డుతగలడంపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. తాను రైతు సమస్యలపై చర్చించేందుకు అనుమతిస్తానని చెప్పినా వినలేదన్నారు. అందువల్లనే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు.
సంయమనం పాటించినా....
తాను చాలా సేపు వారిని సస్పెండ్ చేయకుండా వెయిట్ చేశానని, కానీ వారి ప్రవర్తన మార్చుకోలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను టీడీపీ సభ్యులు హరించి వేస్తున్నారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. సభా సమయాన్ని వృధా చేయడం సరికాదన్నారు. సంయమనంతో వ్యవహరించామని, ప్రజలు అన్నీ గమనించాలనే తాను వారికి సమయమిచ్చామని తెలిపారు. తాను సస్పెండ్ చేస్తే వారు వెళ్లిపోవాలని రోజూ కోరుకుంటున్నారన్నారు.