ఉగాది మహోత్సవాలకు సిద్ధమవుతోన్న శ్రీశైల క్షేత్రం

వేడుకలలో భాగంగా తమ ఇంటి ఆడపడుచు అయిన భ్రమరాంబికా దేవికి చీర, సారె సమర్పించేందుకు, కన్నడ, మరాఠీ భక్తులు..

Update: 2022-03-30 06:13 GMT

శ్రీశైలం : ఉగాది మహోత్సవాలకు శ్రీశైల క్షేత్రం సిద్ధమవుతోంది. తెలుగు సంవత్సరాది తొలి పండుగకు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని అధికారులు విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో శ్రీశైలం దేవస్థానం ప్రత్యేకశోభను సంతరించుకుంది. స్వామివారి యాగశాలలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

వేడుకలలో భాగంగా తమ ఇంటి ఆడపడుచు అయిన భ్రమరాంబికా దేవికి చీర, సారె సమర్పించేందుకు, కన్నడ, మరాఠీ భక్తులు ఏటా భారీగా తరలి వస్తారు. వందల కిలోమీటర్ల దూరంలోని తమ ప్రాంతాల నుంచి, కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు భక్తులు. ఇప్పటికే లక్షలాదిమంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. ఉగాది నాటికి స్వామి, అమ్మవార్లను దాదాపు 5 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారుల అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా, శ్రీశైలంలో ఏర్పాట్లపై ఆలయ ఈవో లవన్న ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయన ఆధ్వర్యంలో కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో మల్లన్నను కొలిచే ప్రాంతాలకు వెళ్లి, ఈ ఏటా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లపై ప్రత్యేకంగా వివరించారు.



Tags:    

Similar News