పోలింగ్ సిరాపై తప్పుడు ప్రచారం.. వాటిని నమ్మొద్దండీ
పోలింగ్ సిబ్బంది వినియోగించే సిరాపై జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండించారు
ఓటు వేసినప్పుడు పోలింగ్ సిబ్బంది వినియోగించే సిరాపై జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటివద్ద మార్క్ చేసి ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ ఇచ్చారు.
ప్రభుత్వం వద్దనే...
చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.