Amaravahti : అమరావతి రైతులకు శుభవార్త.. ఇక భూముల ధరలు అమాంతం పెరిగినట్లే

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది;

Update: 2024-12-03 04:17 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు నెలలోనే రాజధాని నిర్మాణపనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు చివరి నాటికి టెండర్లను ఖరారు చేస్తుంది. ఫేజ్ 1 నిర్మాణాలను తక్షణం పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఆర్డీఏ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో జనవరి నుంచి ప్రారంభమైన నిర్మాణాలు అత్యంత వేగంగా పనులు పూర్తి చేసుకునేలా రోడ్ మ్యాప్ ను రూపొందించడానికి సీఆర్డీఏ అధికారులు సిద్ధమయ్యారు.

ప్రధాన పనులన్నీ…

2,498 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం జరుగుతుంది. 546 కోట్ల రూపాయల వ్యయంతో ఐఏఎస్ క్వార్టర్ల నిర్మానానికి సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది. మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,523 కోట్ల రూపాయల వ్యయంతో రాజధాని పరిధిలో భవనాల నిర్మాణం జరుగుతుంది. హైకోర్టు, శాసనసభ భవనాలకు నిర్మాణానికి సంబంధించి డిజైన్లను ఈ నెల పదిహేనో తేదీ లోగా ఖరారు చేయనున్నారు. వాటిని కూడా టెండర్లు పిలిచి త్వరగా పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ సిద్ధమయింది. రహదారులు, భవనాల నిర్మాణాలు పూర్తయితే అమరావతిలో భూముల అమాంతం పెరిగే అవకాశముందన్నఅంచనాలో రైతులున్నారు. రోడ్లు సరైనవి పడితే చాలు భూముల ధరలు రెట్టింపు అవుతాయని చెబుతున్నారు. అందులోనూ ఎక్కడా వంకర లేకుండా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు టెండర్లను పిలవనున్నారు.

మూడేళ్లలోనే పనులు…

మూడేళ్లలోనే చాలా వరకూ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది. అమరావతికి ఒక రూపు రేఖలు తెచ్చిన తర్వాత దానంతట అదే పెరిగి సంపద కూడా తాము అనుకున్న తరహాలో సమకూరుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధమ ప్రాధాన్యతను చంద్రబాబు ఇస్తున్నారు. జనవరిలో పనులు ప్రారంభమయితే కనీసం ఏడాదిలో ఒక రూపు రేఖలు వస్తాయని, అప్పటి నుంచి భూముల విలువ పెరుగుతుందని రైతులు భావిస్తున్నారు. ఈ జనవరి సంక్రాంతికి వదిలేస్తే వచ్చే సంక్రాంతి నాటికి భూములు కొనాలన్నా అమరావతిలో దొరకవన్న తరహాలో రైతులున్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను రైతులు స్వాగతిస్తూనే రైల్వే లైన్ కు కూడా సహకరిస్తే మరింత భూముల విలువ పెరుగుతుందని చెబుతున్నారు. ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా చేయనున్నారు. మొత్తం మీద 2025 నాటికి అమరావతి రైతులకు చెప్పలేనంత ఆనందాన్ని అమరావతి మిగులుస్తుందన్న భావనలో రైతులున్నారు.



Tags:    

Similar News