కొప్పునూరులో బయటపడిన శిలాయుగపు చిత్రకళ

పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, కొప్పునూరు పొలిమేర గుండాలలో శిలాయుగపు చిత్రకళ వెలుగు చూసిందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

Update: 2023-10-16 11:01 GMT

కొప్పునూరు స్టోన్ ఏజ్ ఆర్ట్



పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, కొప్పునూరు పొలిమేర గుండాలలో శిలాయుగపు చిత్రకళ వెలుగు చూసిందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. పురాతన అవశేషాలు, వారసత్వ కట్టడాలను గుర్తించి, స్థానికులకు అవగాహన కల్పించే 'ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ 'కార్యక్రమంలో భాగంగా, మాచర్ల మండలం, కొప్పునూరు గ్రామ శివారులోని గుండాల వద్ద గల వీరుల వాగు వద్ద గల కాకతీయుల కాలపు శిధిల వెంకటేశ్వర ఆలయాన్ని పరిశీలిస్తుండగా, వాగులో కొత్త రాతియుగపు దుప్పి బొమ్మను అనుకోకుండా కనుక్కోవడం జరిగిందన్నారు. మాచర్ల చరిత్రకారుడు, పావులూరి సతీష్, రమేష్ , కొప్పునూరుకు చెందిన స్థానిక యువకుడు, దుర్గంపూడి యుగనాథ్ రెడ్డి, బుద్ధవనం ప్రాజెక్టు అధికారి, డి.ఆర్. శ్యాంసుందర రావు బృందంతో కలిసి, వాగులో తిరిగి వస్తుండగా, శిలాయుగపు రాతి ఆవాసపు గోడపై 20x15 సెంటీమీటర్ల పొడవు, ఎతులతో ఉన్న దుప్పి చిత్రం కనిపించిందన్నారు. కొత్త రాతియుగపు ప్రజలు వారు నిత్యం వాడే రాతి పనిముట్లతో రాతిచరియ కప్పుపై వరసగా కొట్టి, చక్కటి కొమ్ములున్న దుప్పి బొమ్మను తీర్చిదిద్దారని, కొంచెం దూరంలో కొత్త రాతియుగపు రాతి పనిముట్లు తయారు చేసుకొన్న ఫ్యాక్టరీ స్థలం ఉందని ఆయన చెప్పారు.

అదే వీరుల వాగులో ఉన్న మరో రాతి ఆవాసం పై, తెల్ల జిగురు రంగుతో ముద్రించిన రెండు చేతి ముద్రలు ఉన్నాయని, సమీప పొలాల్లో ఉన్న ఇనుప యుగపు సమాధుల వల్ల ఈ చేతి ముద్రలు క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటివని శివనాగిరెడ్డి చెప్పారు. వాగు బయట గల పొలాల్లో శాతవాహన కాలపు ఇటుకలు, మట్టి పాత్రల అవశేషాలను కూడా గుర్తించామని తద్వారా, కొప్పునూరు గ్రామానికి శిలాయుగం నుండి శాతవాహన కాలం వరకు చరిత్ర ఉందని, ఈ పురావస్తు ఆధారాలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాలని, కొప్పునూరు గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.





Tags:    

Similar News