Ys Jagan : కావాలనే చేశారా? అంత హైట్ లో ఉన్న జగన్ కు రాయి అంత బలంగా ఎలా విసరగలిగారు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన నుదిటిపై తీవ్రగాయమైంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన నుదిటిపై తీవ్రగాయమైంది. రాష్ట్రంలో అలజడి రేపింది. విజయవాడ ప్రభుత్వ వైద్యులు ఆయనకు చికిత్స చేసి రెండు కుట్లు పడ్డాయని తెలిపారు. అయితే అంత ఎత్తులో ఉన్న జగన్ నుదుటున అంత బలంగా ఎలా రాయి విసరగలిరారన్న చర్చ మాత్రం జరుగుతుంది. ఎడమ కంటి పై భాగంలో తగిలింది కాబట్టి సరిపోయింది.. అదే నుదుటి పై బలంగా విసిరిన రాయి తగిలి ఉంటే తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని వైద్యులు సయితం అభిప్రాయ పడుతున్నారు. కణతకు తగిలితే ప్రాణాలకే ముప్పు ఏర్పడేదని కూడా అంటున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
దేనిని ఉపయోగించారు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణించే బస్సు పది అడుగులు పైనే ఉంటుంది. అది ఓల్వో బస్సు. బస్సు పైకి ఎక్కిన జగన్ అందరితో అభివాదలు చేస్తూ వెళుతున్నారు. అంటే కింది నుంచి పదమూడు నుంచి పదిహేను అడుగుల ఎత్తులోకి రాయి విసిరినట్లు అనుమానం కలుగుతుంది. అంత బలంగా విసిరారంటే చేతితో విసిరితే జరగదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందుకే క్యాట్ బాల్ (పక్షులను కొట్టే ఉపయోగించే) దానిని ఉపయోగించి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కావాలనే ఎవరో అక్కడ మాటు వేసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నది పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఆ దిశగానే విచారణ జరుపుతున్నారు. రాయి విసరడంలో నైపుణ‌్యం కలిగిన వారే ఈ దాడికి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
భవనంపైకి ఎక్కాడా?
నిందితుడు అంతా అనుకూల ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా ఇందుకు అద్దం పడుతుంది. అక్కడ విద్యుత్తు లేకపోవడం, చీకటిగా ఉండటం, బిల్డింగ్ పై నుంచి రాయి విసిరితే అంత బలంగా నుదుటికి తగులుతుందా? అన్న కోణంలో పోలీసులు విచారించనున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఒక భవనంపై నుంచి నిందితుడు రాయి విసిరి ఉండవచ్చన్న అనుమానం ఉంది. జగన్ ప్రయాణిస్తున్న వాహనం పైకి దూసుకు వచ్చిన రాయి వైపు ఉన్న భవనాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే అక్కడ విద్యుత్తు లేకపోవడంతో సీసీ టీవీ ఫుటేజీ ఏ మేరకు లభ్యమవుతుందన్నది చూడాల్సి ఉంది. పోలీసులు మాత్రమ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు నియమితులయ్యాయి. స్థానికులను కూడా విచారిస్తున్నారు. రెండు రోజుల విశ్రాంతి తీసుకున్న అనంతరం తర్వాత ఆయన తిరిగి బస్సు యాత్రను ప్రారంభిస్తారని చెబుతున్నారు.