Ragging In AP: పల్నాడులో ర్యాగింగ్.. ఆ వీడియోలు ఎంత దారుణంగా ఉన్నాయంటే?

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ విద్యార్థి

Update: 2024-07-25 04:13 GMT

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఫిబ్రవరి 2న ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల హాస్టల్ ఆవరణలో ఎన్‌సిసి శిక్షణ ఇప్పిస్తామనే నెపంతో 10 మంది డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. చివరి సంవత్సరం విద్యార్థులు తమ జూనియర్లను కర్రలతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు బృందం కళాశాలకు వెళ్లి విచారణ చేపట్టింది.

జూనియర్‌లను ర్యాగింగ్‌ చేసిన చివరి సంవత్సరం విద్యార్థులు మార్చి/ఏప్రిల్‌లో పరీక్షలు పూర్తీ చేసి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. బాధితులు ఇప్పుడు ఆఖరి సంవత్సరం చదువుతూ ఉన్నారు. విద్యార్థులు ఇచ్చిన సమాచారం, వీడియో క్లిప్‌లో లభించిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఓ విద్యార్థిని అరెస్ట్ చేశారు. మరిన్ని అరెస్టులు జరుగుతాయని పోలీసులు తెలిపారు.
హాస్టల్‌ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన విజువల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కళాశాల బాయ్స్‌ హాస్టల్‌లో జరిగిన దారుణం వెలుగుచూసింది. పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన విద్యార్థి ఈ కాలేజీలో కొన్ని రోజులకే మానేశాడు. మళ్లీ అందులో చేరాలని ఆ విద్యార్థిపై తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. దీంతో ఆ విద్యార్థి జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ పేరిట వేధిస్తున్నారని, హాస్టల్‌ గదుల్లో పడేసి చితకబాదుతున్నారని చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియోలను బయట పెట్టాడు. ఈ వీడియోలోని దృశ్యాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినవని తేలింది.



Tags:    

Similar News