పవన్ కళ్యాణ్ ను చంపడానికి సుపారీ గ్యాంగ్ లను దింపారట

అధికారం పోతుందన్న భావన నాయకులను క్రూరంగా మార్చేస్తుంది. ఎంతకైనా తెగిస్తారని అన్నారు. తనను భయపెట్టేకొద్దీ మరింత రాటుదేలుత

Update: 2023-06-18 02:33 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు ప్రాణహాని ఉంది.. ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారనే సమాచారం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలను పాటించండని పవన్ కళ్యాణ్ కోరారు. అధికారం కోల్పోతామనే భయంలో వైసీపీ నాయకులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అధికారం పోతుందన్న భావన నాయకులను క్రూరంగా మార్చేస్తుంది. ఎంతకైనా తెగిస్తారని అన్నారు. తనను భయపెట్టేకొద్దీ మరింత రాటుదేలుతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీరమహిళల మీద చేసిన దాడిని మర్చిపోనన్నారు. ఓ బలమైన కార్యాచరణ లేక అప్పట్లో వెనుకడుగు వేశామని.. సరైన సమాధానం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వైకాపాకు ఒక్కటీ దక్కకూడదని స్పష్టం చేశారు. తాను సినీ నటుడిని కాకపోయి ఉంటే.. బలమైన నాయకుడిగా జనంలోకి చొచ్చుకుని వెళ్లేవాడిననన్నారు. అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటోందని చెప్పారు.

బాలు సినిమా సమయంలో ఓ ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నారా అని అడిగారు.. ఎందుకు అని నేను అడిగితే మీ కుటుంబానికి కాస్త హాని తలపెట్టే అవకాశం ఉందని చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాల్లోకి మా కుటుంబం వస్తే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని, మేం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పించేందుకు మా ఇంటి ఆడబిడ్డల మీద విపరీతమైన దుష్ర్పచారం చేసేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. రాజకీయాల్లో పదవి పోతుందనే భయం చాలా చెడ్డది.. కడుపులోని బిడ్డను కూడా చంపేందుకు వెనుకాడరని అన్నారు.


Tags:    

Similar News