Tiruamala Laddu Controversy : లడ్డూ వివాదంపై సిట్ విచారణకు బ్రేక్ పడిందా?
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ ఈ నెల 12వ తేదీ తర్వాతనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ ఈ నెల 12వ తేదీ తర్వాతనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఈ నెల 3వ తేదీ స్పష్టమైన తీర్పు తెలిపింది. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సీీబీఐలో ఆ ఇద్దరు అధికారులు ఎవరుంటారన్నది సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎవరు ఉంటారన్నది డీజీపీ నిర్ణయించనున్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో...
అయితే తిరుమలలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తిరుమలకు నిత్యం చేరుకుంటారు. ఇసుకవేస్తే రాలనంత రద్దీ ఉంటుంది. ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఇప్పట్లో సాధ్యం కాదన్నది అధికారుల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పుడు వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో పాటు ఇతర అధికారులు బిజీగా ఉంటారు. రికార్డులను పరిశీలించేందుకు కూడా వీలుండే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పాటు లడ్డూను తయారు చేసే పోటును కూడా సిట్ పరిశీలించాల్సి ఉంది.
రద్దీ ఉన్నప్పడు...
ఇవన్నీ జరగాలంటే ఇంతటి రద్దీలో అది సాధ్యం కాదన్నది అధికారుల అంచనా. బ్రహ్మోత్సవాల సమయంలో వెళ్లి అక్కడ వెయిట్ చేసే కంటే తిరుమలకు ఆ తర్వాత వెళ్లడమే మంచిదన్న అభిప్రాయంలో అధికారులున్నట్లు తెలిసింది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఈ విచారణకు ఎలాంటి గడువు కూడా విధించకపోవడంతో కొంత ఆలస్యమయినా కూలంకషంగా విచారణ చేపట్టేందుకు తర్వాతే తిరుమలకు వెళ్లడం మేలన్న ఒపీనియన్ లో ఉంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకూ జరగనున్నాయి. దీంతో పన్నెండు తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణను చేపట్టే అవకాశముంది. అప్పటి వరకూ విచారణకు బ్రేక్ పడినట్లేనని అనుకోవాలి.