Galla Jayadev : గల్లా అనవసరంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారా? ఇప్పుడు రియలైజ్ అయ్యారా?
రాంగ్ డెసిషన్ తీసుకుని గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానని ప్రకటించడం రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్లే
గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి తప్పు చేశారా? ఆయన ఉన్న నియోజకవర్గాన్ని కాలదన్నుకుని వెళ్లిపోవడంతో రాజకీయంగా దెబ్బితిన్నారా? అంటే అవుననే అనాల్సి వస్తుంది. గెలిచే టైం లో రాంగ్ డెసిషన్ తీసుకుని గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానని ప్రకటించడం ఆయన రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది. మొన్న జరిగిన ఎన్నికల్లోనూ కూటమికి వీచిన బలమైన గాలిలో గల్లా జయదేవ్ ఖచ్చితంగా గెలిచేవారు. మరోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యేవారు. అంతా బాగుంటే కేంద్ర మంత్రిగా కూడా అయ్యేవారు. కానీ తన చేజేతులా పొలిటికల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసుకున్నట్లు కనపడుతుంది.
వ్యాపారమే ముఖ్యమని...
2024 ఎన్నికలకు ముందు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. స్వల్ప విరామమేనని ఆయన తెలిపారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. దీనికి అనేక కారణాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తన వ్యాపారాలపై దాడులు పెరగడంతో పాటు రాజకీయంగా తాను ఉంటే వ్యాపారంగా తన కుటుంబం నష్టపోవాల్సి వస్తుందని ఆయన భావించారు. ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులతో పాటు బీజేపీతో సఖ్యత లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని గల్లా జయదేవ్ అప్పట్లో భావించి వ్యాపారాలకే ప్రాధాన్యత ఇస్తూ ఈ డెసిషన్ తీసుకున్నారు.
గుంటూరు నో వెకెన్సీ....
అయితే అనూహ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ జట్టుకట్టింది. కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. తాను ఏ మాత్రం కొంత ధైర్యంచేసినా ఇప్పుడు గుంటూరు నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యేవారంటున్నారు. ఇప్పుడు గుంటూరు నియోజకవర్గానికి టీడీపీ నేతగా పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చారు. ఆయన కూడా వ్యాపారవేత్త. పైగా గుంటూరు జిల్లాకు స్థానికుడు. ఆర్థికంగా బలవంతుడు. ఇక గుంటూరు నియోజకవర్గం మాత్రం గల్లా జయదేవ్ చేజారి పోయినట్లేనని చెప్పకతప్పదు. ఎందుకంటే పెమ్మసానిని కాదని గల్లా జయదేవ్ కు భవిష్యత్ లో పార్టీ ప్రయారిటీ ఇచ్చే అవకాశం దాదాపుగా శూన్యమనే చెప్పాలి.
ఏ నియోజకవర్గమూ...
ఇక గల్లా జయదేవ్ కు 2029 ఎన్నికల్లో మరో నియోజకవర్గం ఎక్కడా కనిపించడం లేదు. ఏలూరు, రాజమండ్రి, విశాఖ వంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్నా అక్కడ ఆల్రెడీ నేతలు పాతుకుపోయి ఉన్నారు. దీంతో తాను తీసుకున్న నిర్ణయంతో రాజకీయాలకు స్మాల్ బ్రేక్ అని అనుకున్నప్పటికీ పెద్ద బ్రేక్ వచ్చినట్లేనన్నది పరిశీలకుల భావన. కాకుంటే గల్లా జయదేవ్ అంటే చంద్రబాబుకు కొంత సానుకూలత ఉంది. ఆయనకు భవిష్యత్ లో రాజ్యసభ పదవి లాంటిది ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. అంతే తప్పించి ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి గల్లా జయదేవ్ రావాలంటే మరోసారి లక్కు ఆయన తలుపు తట్టాల్సిందే మరి.