Breaking : రెండు పార్టీల తొలి జాబితా ఇదే.. 118 స్థానాల అభ్యర్థులు వీరే
మరో యాభై రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను ప్రకటించాయి
మరో యాభై రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను ప్రకటించాయి. చంద్రబాబు, పవన్ లు ఉమ్మడి ప్రకటన చేశారు. పెద్దగా వివాదం లేని నియోజకవర్గాలకు తొలి జాబితాలో చోటు కల్పించారు. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత రెండో జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికయితే 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో జనసేన నుంచి పదిహేను సీట్లు ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి.
కొద్ది రోజులుగా కసరత్తులు...
గత కొద్ది రోజులుగా కసరత్తులు చేస్తున్న చంద్రబాబు గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. ముఖ్యమైన నేతలతో చర్చించిన తర్వాత ఆయన ఈ జాబితాను విడుదల చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాలకు సంబంధించిన టిక్కెట్ల వ్యవహారం కూడా అక్కడి నేతలతో చంద్రబాబు చర్చించారు. పొత్తులతో వెళుతున్నందున ఈసారి సర్దుకు వెళ్లాలని సూచించారు. అందుకు చాలా మంది నేతలు అంగీకరించారు. మరికొందరికి మాత్రం తప్పనిపరిస్థితుల్లో తప్పించాల్సి వస్తుందని కూడా సంకేతాలు అందించారు. వైసీపీ నుంచి వచ్చి కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా కొందరికి అవకాశం కల్పించాలని సూచించారు.
జనసేన ఆశించే...
జనసేన ఆశించే స్థానాల్లో ఉన్న టీడీపీనేతలకు కొందరికి ప్రత్యామ్నాయ నియోజకవర్గాలు సూచించగా, మరికొందరికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి పంపారు. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు నాయకులకు నచ్చ చెప్పగలిగారు. పొత్తులో ఉన్న పార్టీని కూడా మన గౌరవించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కొన్ని స్థానాలకు మాత్రం ఫస్ట్ లిస్ట్‌లో చోటు కల్పించారు.
పొత్తులో భాగంగా...
పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. జగన్ ను ఓడించడమే ప్రస్తుతం అందరి ముందున్న కర్తవ్యమని, అందులో భాగంగా అందరూ సహకరించాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సముచితమైన స్థానం దక్కుతుందని ఆయన హామీ ఇచ్చారు. మనందరిది ఒకటే లక్ష్యం.. వైసీపీని ఓడించడమేనని, అందరూ సమన్వయంతో కలసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఇద్దరు నేతలు పిలుపు నిచ్చారు.