Chandrababu : నా రెండో సంతకం ఆ ఫైలుపైనే.. వెంటనే దానిని రద్దు చేసి పారేస్తాం
ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన క్యాంపెయిన్ ను మరింత ఉధృతం చేశారు
ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన క్యాంపెయిన్ ను మరింత ఉధృతం చేశారు. ఈరోజు కురుపాంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని తెలపిారు. వైసీపీ ఫ్యాన్ ముక్కలు కావడం ఖాయమని చెప్పారు. జలగ జగన్ దళిత, గిరిజన ద్రోహి అని అన్నారు. జలగ జగన్ ఓటేసిన వారిని కాటేసే రకం అని అన్నారు. ప్రజల్ని ఇంకా మోసం చేయాలని చూస్తున్నారని, 60 శాతం సబ్సిడీతో ట్రైకార్ రుణాలిచ్చేవాళ్లమని, ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. గిరి గోరుముద్దల పథకం తీసుకొచ్చి బాలింతల్ని ఆదుకున్నామని తెలిపారు.
అన్నీ నిర్వీర్యం చేసి...
ఏకలవ్య మోడల్ స్కూల్స్ ను నిర్వీర్యం చేశారన్న చంద్రబాబు లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోచుకున్నారన్నారు. జీవో నం.3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలిచ్చామని తెలిపారు. జీవో నం.3ని రద్దు చేసిన వ్యక్తికి ఓటు వేయకూడదని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అధికారంలోకి రాగానే మళ్లీ జీవో నం.3 తీసుకొస్తానని తెలిపారు. జగన్ మీ బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన కేన్సర్ గడ్డ అని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొస్తున్నామని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యమన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలు పెంచేశారని, జగ్గు భాయ్ బ్రాండ్‍తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు.
పేదలకు బటన్ నొక్కారని...
బటన్ నొక్కితే 24 గంటల్లో డబ్బులు రావాలి కదా? అని ప్రశ్నించారు. జనవరిలో బటన్ నొక్కితే పేదవారికి డబ్బులు ఎందుకు అందలేదని అన్నారు. బటన్ నొక్కినా డబ్బులు ఇవ్వలేదని నాటకమాడుతున్నారన్నారు. ఆయన నొక్కిన బటన్ పేదవాడికి కాదు.. దళారులకు నొక్కాడన్నారు. గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేశామని తెలిపారు. అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచవ్యాప్తంగా పంపామని తెలిపారు. మీ పాస్ పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు వేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపైనే తన రెండో సంతకం అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం తధ్యమని అన్నారు.