నేను అలా అనలేదు.. టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ
పొత్తులపై తాను మాట్లాడలేదని.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చంద్రబాబు నాయుడు అన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలంటూ కాకినాడ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పాతమిత్రులను కలుపుకునేందుకు చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారని.. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం నడిచింది. ఆ తర్వాత రెండు రోజులకే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే రాష్ట్రంలో అంధకారమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరూ మరోమారు జతకట్టబోతున్నారనే చర్చలు నడిచాయి.
అయితే ఇంతలోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పొత్తుల గురించి తాను వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలన్నానని.. నా వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. పొత్తలపై మాట్టాడినట్టు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పొత్తులపై ఎక్కడా మాట్లాడలేదని ఆయన తేల్చిచెప్పారు. భీమిలో పర్యటనలో జై బాబు అని నినదిస్తే.. జై జగన్ అన్నారంటూ మార్ఫింగ్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ చేసేవి డైవర్షన్ పాలిటిక్స్ అని టీడీపీ చీఫ్ అన్నారు. జగన్ పులి కాదు పిల్లి అని.. భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు.