కష్టాలు మూడు నెలలే అంటున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో

Update: 2023-12-08 09:40 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు రాత్రికి బాపట్లలోనే బస చేస్తారు. దేవేంద్రపాడు వద్ద నిరసన చేస్తున్న రైతులను చూసి ఆగి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనతో తమ పలు సమస్యల గురించి తెలిపారు. దీంతో ప్రజల కష్టాలు మరో మూడు నెలల్లో తొలగిపోతాయని హామీ ఇచ్చారు. తాను పర్యటిస్తున్నానని జగన్ హడావుడిగా బయల్దేరారని.. పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడని నిలదీశారు. పంటబీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా దెబ్బతిన్న పొలాలను కూడా చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని ఆయన అన్నారు. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందని చెప్పారు. ఏపీలో ప్రభుత్వ తప్పుల గురించి ప్రశ్నిస్తే తనలాంటి వారిని కూడా జైల్లో పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చేయని తప్పుకు తనను జైల్లో పెట్టారని, ఎంతో మానసిక క్షోభను అనుభవించానని అన్నారు. దేశంలో ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయింది ఏపీలోనే అని చంద్రబాబు చెప్పారు. కరవు వల్ల సగం మంది రైతులు పంటలు వేయలేదని... పంట వేసిన వారంతా తుపాను వల్ల నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే... నష్టపోయిన రైతులను 3 నెలల తర్వాత తాను ఆదుకుంటానని చెప్పారు.


Tags:    

Similar News