కుప్పంలోనా... వైసీపీనా..?
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ గెలిచే ప్రసక్తి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ గెలిచే ప్రసక్తి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా కుప్పంలో వైసీపీ అడుగుపెట్టలేదని ఆయన అన్నారు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని ఆయన తెలిపారు. తనపై రాళ్ల దాడి చేస్తే పర్యటనలను మానుకుంటారని వైసీపీ నేతలు భావించారన్నారు. కానీ తాను దేనికీ భయపడబోనని చంద్రబాబు తెలిపారు. మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అని ఆదోని, ఎమ్మిగనూరు ప్రజలు నినదించారన్నారు.
మూడు రాజధానులను...
జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ క్రియాశీల పాత్ర పోషించిన విషయాన్ని చంద్రబాబు సమావేశంలో గుర్తు చేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో ప్రజలు పోటెత్తారన్నారు. తమ అభిప్రాయాన్ని ఎమ్మిగనూరు, ఆదోని టూర్ లో తెలియ చేశారన్నారు. మూడు రాజధానుల జగన్ ప్లాన్ కూడా పనిచేయదన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని చంద్రబాబు నేతలతో అన్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. జగన్ తప్పులన్నీ రికార్డులవుతున్నాయని, అధికారులను కూడా గుర్తు పెట్టుకుంటామని, అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తానని ఆయన అన్నారు. కొందరు అధికారులు జగన్ రెడ్డికి బంట్రోతులుగా వ్యవహరిస్తున్నారన్నారు.