Chandrababu : ఎన్డీఏ ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేయాలి
చెల్లెలికి అప్పులు ఇచ్చి ఆస్తి మొత్తాన్ని కొట్టేసిన చరిత్ర జగన్ ది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
జగన్ సొంత చెల్లెళ్లకే న్యాయంచేయలేదని, చెల్లెలకు అప్పులు ఇచ్చి ఆస్తి మొత్తాన్ని కొట్టేసిన చరిత్ర జగన్ ది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పాతపట్నంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. చెల్లెళ్లు ఇద్దరూ తమకు న్యాయం చేయాలంటూ రోడ్లపై తిరగాల్సిన దుస్థితిని తీసుకు వచ్చిన జగన్ రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయంచేస్తారని ప్రశ్నించారు. జగన్ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. రైతులను నిలువునా ముంచారన్నారు. వ్యవసాయ భూములను కూడా ఆక్రమించుకునేందుకు ఈవైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చుక్కల భూముల్లో భారీ అక్రమాలు జరిగాయన్నారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చి భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఉద్యోగులకు కూడా...
ఇది అది పెద్ద కుట్ర అని చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళంలో వలసలు ఎక్కువగా ఉంటాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలు లేకుండా గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐదేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధిని చేసి చూపిస్తామని తెలిపారు. ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు చెల్లించడమే కాకుండా, పెండింగ్ బకాయీలు కూడా వెంటనే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకూ వడ్డీ లేని రుణాలను అందిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్పీవ్ చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు.