Chandrababu : ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటికే పింఛను
ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటికే పింఛను అందచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు
ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటికే పింఛను అందచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛను మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు కుప్పం ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు తాను ఇక్కడకు వచ్చానన్న చంద్రబాబు ఈసారి లక్ష మెజారిటీతో గెలిపించాలన్నారు. జగన్ దోపిడీని అరికట్టాలంటే కుప్పం నుంచే వైసీపీ పతనం ప్రారంభం కావాలన్నారు.
వైసీపీకి డిపాజిట్ కూడా...
ఇక్కడ ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. కుప్పం నుంచి ఇప్పటి వరకూ ఏడుసార్లు తనను గెలిపించారని, తాను మరోసారి గెలిస్తే కుప్పాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొస్తాననిచెప్పారు. జగన్ నీళ్లు తెచ్చినట్లు పెద్ద డ్రామాలాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని, జగన్ తీసుకు వచ్చిన నీళ్లతో కుప్పం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని, హెలికాప్టర్ తో కాపాడు జగన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే కుప్పం టీడీపీ కార్యకర్తలు, నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తానని ఆయన తెలిపారు. తనను మరోసారి గెలిపిస్తే కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు.