ఎవరూ ఊహించని విధంగా లండన్ కు వెళ్లిన సీఎం జగన్.. టీడీపీ నేతల సంచలన ఆరోపణలు
జగన్ రెడ్డి దావోస్ అని బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్ ఎంబ్రేయర్ లినీయజ్ 1000. ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ కు వెళ్లడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా లండన్‌కు వెళ్లారని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సీబీఐ కోర్టులో దావోస్‌కు వెళ్తున్నానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. లండన్ వరకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ మేరకు అయ్యన్నపాత్రుడు శనివారం వరుస ట్వీట్లు చేశారు.
''జగన్ రెడ్డి దావోస్ అని బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్ ఎంబ్రేయర్ లినీయజ్ 1000. ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ ఇది. దీని ఖర్చు, గంటకు 14,500 డాలర్లు. అంటే గంటకు రూ.12 లక్షలు. జగన్ రెడ్డి దావోస్ అని చెప్పి, లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్ లో దిగారని తెలుస్తోంది.
"లండన్ కు దాదాపుగా 13-14 గంటల సమయం. దాదాపుగా కోటిన్నర కేవలం ఫ్లైట్ ఖర్చు. ఇక లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్, కేవలం ప్రైవేట్ ఎయిర్ పోర్ట్. ధనవంతులు మాత్రమే దిగే చోటు. ఇక్కడ పార్కింగ్ ఫీజ్, ప్రపంచ కుబేరులు మాత్రమే భరించగలరు. లావిష్ ఫ్లైట్ లో, రాయల్ గా, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి వెళ్తున్నాడు జగన్ రెడ్డి. మన పొట్టలు కొట్టి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక జగన్ రెడ్డి, సీబీఐ కోర్ట్ లో, తాను దావోస్ వెళ్తున్నా అని చెప్పి, లండన్ వరకు ఎందుకు వెళ్లారో మరి? చిదంబర రహస్యం ఏంటో ? మీ ఎంపీ గారు చెప్పింది, నిజమేనా అయితే?'' అని అయ్యన్న పాత్రుడు ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ ల్యాండింగ్ వెనుక మిస్టరీ ఏమిటి..? అని మరో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సూటి ప్రశ్నలు సంధించారు. 3ఏళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అని ఆయన ప్రశ్నించారు. అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ లో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉందని యనమల అన్నారు. అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..? చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు.
అధికారులను వదిలేసి భార్యతో కలిసి లండన్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వ్యక్తిగత పనులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ దేశానికి వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చిందని ప్రశ్నించారు. అధికారులను వదిలేసి లండన్ ముగ్గురే(భార్య, మరొకరు) వెళ్లడం లోగుట్టు ఏమిటి..? మీ సొంత పనులకు, సీక్రెట్ పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా..? అని యనమల ప్రశ్నించారు.