Vijayawada : నామినేటెడ్ పోస్టుల జాబితాలో మా పేర్లేవి అన్నయ్యా?

విజయవాడ నగరంలో నామినేటెడ్ పోస్టులు టీడీపీ నేతలకు దక్కలేదు. అనేక మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు

Update: 2024-09-25 08:04 GMT

TDP

విజయవాడ నగరంలో నామినేటెడ్ పోస్టులు నేతలకు దక్కలేదు. అనేక మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అందులో ఏ ఒక్కరికీ పోస్టు దక్కలేదు. దీంతో వారు నిరాశకు గురయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒక పోస్టు వస్తుందన్న నమ్మకంతో నేతలున్నారు. అయితే తొలి జాబితాలో మాత్రం బెజవాడ తమ్ముళ్లకు మాత్రం చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. వీరికోసం మరేదైనా పదవులు ఎదురు చూస్తున్నాయా? అన్న సందేహం కలుగుతుంది. అందుకే బెజవాడ నేతలందరూ నిన్న నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన తర్వాత ఒకింత సైలెంట్ అయ్యారనే చెప్పాలి.

లెక్కకు మించి...
బెజవాడలో టీడీపీకి లెక్కకు మించి నేతలున్నారు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పట్టాభిరామ్ వంటి నేతలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ కూడా టీడీపీలో కీలకంగా ఉండి గత వైసీపీ పాలనలో గాయాలపాలయ్యారు. చంద్రబాబు స్వయంగా వీరిని పరామర్శించిన సంగతిని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఏదో ఒక పదవి వస్తుందన్న నమ్మకంతో ఇప్పటి వరకూ ఉన్న నేతలకు ప్రధానమైన పోస్టులన్నీ భర్తీ కావడంతో ఇక తమకు ఏ పదవి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా పదవి కోసమే ఎదురు చూస్తున్నారు.
ఎమ్మెల్సీ పోస్టులకు...
విజయవాడలో బుద్దా వెంకన్న గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. టీడీపీ హయాంలో నాగుల్ మీరా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఉన్నారు. ఆయన గత కొంత కాలంగా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దేవినేని ఉమ, వంగవీటి రాధాలకు మాత్రం ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశముందని అంటున్నారు. వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి చిన్నబుచ్చడమే అంటున్నారు. మరోవైపు మిగిలిన నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా వారికి ఫస్ట్ లిస్ట్‌లో పేరు కనిపించకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. విజయవాడలో టీడీపీ బలోపేతానికి కృషి చేసిన తమకు పదవి ఇస్తామని తమ్ముళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
రానున్న కాలంలో...
కానీ తొలి జాబితాలో నామినేటెడ్ పోస్టులు ఇరవై మాత్రమే ప్రకటించారు. అందులో యువకులు ఎక్కువగా ఉన్నారు. లోకేష్ ముద్ర అందులో కనిపించిందని తమ్ముళ్లు భావిస్తున్నారు. అదే సమయంలో పదహారు టీడీపీ, మూడు జనసేన, ఒకటి బీజేపీకి కేటాయించడంతో మిగిలిన పోస్టులలో తమకు దక్కే అవకాశముందని భావిస్తున్నారు. ఇలా అనేక రకాలుగా సందేహాలు మెదళ్లును తొలుస్తున్నా ఇంకా పదవులు దక్కుతాయన్న ఆశ బెజవాడ తమ్ముళ్లలో ఉంది. పార్టీ బలోపేతం కావడానికి విజయవాడ టీడీపీని నిర్లక్ష్యం చేయరని వారు నమ్ముతున్నారు. రానున్న రోజుల్లో తమ పేరు ఉంటుందని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News