Breaking News : టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి
అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఇటీవల కోమాలోకి వెళ్లారు. ఆరోగ్యం విషమించడంతో.. బచ్చుల అర్జునుడు..
ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు(66) అనారోగ్యంతో కన్నుమూశారు. నెల రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయనను విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఇటీవల కోమాలోకి వెళ్లారు. ఆరోగ్యం విషమించడంతో.. బచ్చుల అర్జునుడు మార్చి 2, గురువారం మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. వెంట వెంటనే టీడీపీలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తారకరత్న మరణించిన 13 రోజులకే బచ్చుల అర్జునుడు మరణించడంతో.. పార్టీ నేతలు దిగ్భ్రాంతి చెందారు.
1995లో రాజకీయాల్లోకి..
1957, జులై4న సుబ్బయ్య- అచ్చమ్మ శివపార్వతి దంపతులకు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు బచ్చుల అర్జునుడు. బీ.ఏ వరకూ చదువుకున్న ఆయన.. టీడీపీలో చేరారు. 1995 నుండి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పి.ఏ.సి.ఎస్) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన 2000 నుండి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపాలిటీ చైర్మన్‌గా పని చేశారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై, 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన 2020లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యారు.