ప్రజా ఉద్యమం తప్పదు.. లోకేష్ వార్నింగ్
కల్తీసారా మరణాలపై తాము ప్రజా ఉద్యమం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు
కల్తీసారా మరణాలపై తాము ప్రజా ఉద్యమం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన టీడీపీ నేతలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. మద్యనిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ తర్వాత దాని ఊసే మరచిపోయారన్నారు. వైసీపీ నేతలే కల్తీ సారా, నాటుసారా, జే బ్రాండ్ మద్యాన్ని తయారు చేస్తున్నారని ఆరోపించారు.
సభనుంచి పారిపోయి....
దీనిపై చర్చ చేయాలని, విచారణ జరపాలని తాము శానసభలో అడిగితే ప్రకటనలు ఇచ్చి పారిపోవడం సరికాదన్నారు నారా లోకేష్. తాము ఈ సమస్యపై ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. దమ్ముంటే పెగాసస్ పై సీబీఐ తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాబాయి హత్యలో కూడా నిష్పక్షపాత విచారణకు సీబీఐకి సహకరించాలని నారా లోకేష్ కోరారు. తమ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని, ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని నారా లోకేష్ అన్నారు.