CM Revanth Reddy: ఏపీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎందుకో తెలుసా?
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సారిగా విశాఖపట్నంకు వెళ్లనున్నారు...
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సారిగా విశాఖపట్నంకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే లోక్‌సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం ప్రచారంలో పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాక్రే ఆహ్వానం మేరకు రేవంత్ ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మూడు సభల్లో పాల్గొననున్నారు.
మొదటి సభ ఈనెల 11వ తేదీన విశాఖలో జరుగనుంది. అయితే 11న ఉదయం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి... అక్కడ నుంచి గన్నవరంకు చేరుకుంటారు. అక్కడనుంచి విశాఖకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.