Andhra Pradesh : టీడీపీ కార్యకర్తల కోసం ... ఐదు లక్షలు
తెలుగుదేశం పార్టీ తన పార్టీ కార్యకర్తల కోసం బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది;
తెలుగుదేశం పార్టీ తన పార్టీ కార్యకర్తల కోసం బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కోటి సభ్యత్వాల వరకూ నమోదవుతాయని భావించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మేరకు బీమా కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు.
కోటి మంది కార్యకర్తల కోసం...
కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు బీమా సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో 42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద భీమా లభిస్తుంది. నారా లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ కార్యకర్తల సంక్షేమం కోసం 138 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.