బ్రేక్ తర్వాత మళ్లీ లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి మరలా ప్రారంభం కానుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి మరలా ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రెండు రోజుల పాటు నిలిపేసిన పాదయాత్రను నేటి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ నారా లోకేష్ 529.1 కిలోమీటర్ల మేర నడిచారు. నేడు 42వ రోజు తంబళ్లపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు కంటేవారిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. కండ్లమడుగు క్రాస్ రోడ్డు వద్ద స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
వరస సమావేశాలతో...
ఉదయం 9.20 గంటలకు హార్స్‌లీ క్రాస్ రోడ్డు వద్ద పెద్దమాండ్య మండల ప్రజలతో నారా లోకేష్ భేటీ అవుతారు. 11 గంటలకు మద్దయ్యగారిపల్లి న్యూ మల్బరీ నర్సరీ వద్ద బీసీ సామాజికవర్గం ప్రజలతో మాట్లాడతారు. అక్కడే భోజన విరామానికి ఆగుతారు. అదే ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంటకు మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. అనంతరం మొగసాలమర్రిలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం కుమ్మరపల్లిలో డెయిరీ రైతులతో లోకేష్ సమావేశమవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు నాయనిబావి వద్ద స్థానికులతో సమావేశమవుతారు. రాత్రికి నాయనిబావి పంచాయతీ గుట్టపాలెం వద్ద బస చేయనున్నారు.