తెలుగుదేశం పార్టీ అభిమానులకు కీలక సూచన
ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభించింది. అయితే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి యాత్ర సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటూ టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ నుండి కీలక సూచన వచ్చింది. ఫలితాలను చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయాలని.. కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కార్యకర్తలకు, టీడీపీ అభిమానులకు సూచన చేసింది.
"తెలుగు దేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరియు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేశ్ గారి సందేశం. తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల నిర్ణయం. దానిని అన్ని పార్టీల వలే మనం కూడా శిరోధార్యంగా భావించాలి. ఫలితాలను చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. 40 సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొని అధికార పక్షం పాత్ర అయినా, ప్రతిపక్షం పాత్ర అయినా పార్టీ పరంగా కానీ, నాయకులు, కార్యకర్తల పరంగా కానీ మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించాం. తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఏపీలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై దృష్టి పెడదాం. ధన్యవాదాలు. " అంటూ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.