కన్నెర్ర చేస్తే బయటకు కూడా రాలేరు.. వైసీపీకి వార్నింగ్
రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
నేను కన్నెర్ర చేస్తే బయటకు కూడా రాలేరని వైసీపీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. పోలీసుల అండతో రెచ్చిపోతే ఫలితం అనుభవిస్తారన్నారు. అమ్మఒడి ఒక బూటకమని, ఇంగ్లీష్ మీడియం నాటకం అని చంద్రబాబు అన్నారు. ఎనిమిదివేల స్కూళ్లను మూసివేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తలొగ్గి స్కూళ్లను మూసివేస్తున్నారన్నారు. జగన్ ఎక్కడ చదువుకున్నాడో తెలియదన్నారు. విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని అన్నారు. స్కూళ్లను మూసివేయడానికి వీలులేకుండా మినీ మహానాడులో తీర్మానం చేద్దామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు చేతకాని పాలనే నిదర్శనమని చెప్పారు. ఏపీలో మూడేళ్లుగా అరాచక పాలన సాగుతుందన్నారు.
ధరలను పెంచేసి..
రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. పోలీసులు రెచ్చిపోతే ప్రజల చేత ఎలా తిరుగుబాటు చేయించాలో తనకు తెలుసునని అన్నారు. గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేశారన్నారు. తాను ఇచ్చిన దీపం పథకాన్ని ఆపేశారన్నారు. ఈరోజు కూడా గ్యాస్ పెంచారని చెప్పారు. నిత్యావసర ధరలు కొనుగోలు చేసేది లేదన్నారు. మద్యం రేట్లను కూడా విపరీతంగా పెంచాడన్నారు. మద్యం కొత్త బ్రాండ్లను తీసుకు వచ్చి ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మద్యంలో ప్రాణం తీసే రసాయనాలు ఉన్నాయని, ఈ బ్రాండ్లు ఆరోగ్యకరానికి హానికరమని అన్నారు. తాగితే నెమ్మదిగా మతిపరుపు రావడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ల్యాబ్ లో పరీక్షిస్తే తేలిందన్నారు.
వ్యవస్థలను విధ్వంసం చేసి...
విద్యుత్తు ఛార్జీలను విపరీతంగా పెంచారన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఐదుసార్లు పెంచారన్నారు. చెత్తపన్ను కూడా వేశారన్నారు. వృత్తి పన్నుల మీద కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ వేసేందుకు రెడీ అవుతున్నాడన్నారు. జగన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశారన్నారు. ప్రజలు తిరగబడితేనే ఈ జగన్ రెడ్డికి తెలిసొస్తుంది, కేసులకు భయపడాల్సిన పనిలేదని, ఇంటికొకరు సిద్ధంగా ఉండమని, పోరాటానికి సిద్ధం కావాని చంద్రబాబు పిలుపునిచ్చారు. మూడేళ్లలో ఎవరికీ ఉపాధి అవకాశాలు దక్కలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడకు పోయిందన్నారు. జీవితాలను నాశనం చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టవద్దని చంద్రబాబు కోరారు.