Kolikapudi : టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం పార్టీకి తలనొప్పిగా తయారయింది.

Update: 2024-09-28 08:17 GMT

kolikapudi srinivasa rao

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం పార్టీకి తలనొప్పిగా తయారయింది. తొలిసారి గెలిచిన కొలికపూడి సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొని చంద్రబాబుకు దగ్గరై కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు టిక్కెట్‌ను సంపాదించారు. చివరకు సీనియర్ నేతలు జవహర్‌ను కూడా పక్కన పెట్టి కొలికపూడికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. రాష్ట్రమంతా బలమైన గాలులు కూటమి వైపు వీయడంతో పాటు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వెరసి తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించారు. గతంలో ట్రాక్ రికార్డును పరిశీలిస్తే తిరువూరులో టీడీపీ గెలిచి దశాబ్దాలు గడిచింది. కేవలం కూటమి వల్లనే కొలికపూడి విజయం సాధ్యమయిందని అందరికీ తెలిసిన విషయమే.

ఎమ్మెల్యే అయిన వెంటనే...
కానీ కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన వెంటనే తన రూపాన్ని మార్చుకున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం విరుచుకుపడిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయారు. సొంతపార్టీ నేతలనే వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తిరువూరు నియోజకవర్గంలో ఒక ఇంటిని కూల్చివేయడానికి తానే కుర్చీ వేసుకుని కూల్చేందుకు చేసిన ప్రయత్నం కూడా విమర్శలకు దారి తీసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాసరావును పిలిచి క్లాస్ పీకారు. ప్రజాప్రతినిధిగా ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చడమేంటని చంద్రబాబు గట్టిగా మందలించడంతో కొంత వెనక్కు తగ్గినట్లు కొలికపూడి శ్రీనివాసరావు కనిపించారు. అయితే ఆయన తన పంథాను మార్చుకోకో పోవడంపై టీడీపీ అధినాయకత్వం కొలికపూడిపై ఒకింత ఆగ్రహంగా ఉందని తెలిసింది.
అధినాయకత్వానికి ఫిర్యాదు...
తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు పై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు తమను వేధిస్తున్నాడంటూ టిడిపి నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆయన మరోసారి పార్టీలో హాట్ టాపిక్ గా మారారు. పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకోని తమకు న్యాయం చేయాలని తిరువూరు టీడీపీ క్యాడర్ విజ్ఞప్తి చేశారు. దీంతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పై అధినాయకత్వం మరోసారి విచారణకు సిద్ధమయినట్లు తెలిసింది. పార్టీకిచెందిన ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి కూడా కారణం కొలికపూడి అని వారు ఆరోపించారు. దీంతో కొలికపూడి పై చర్యలు తీసుకోవాలంటూ తిరువూరు టీడీపీ కార్యకర్తలు ఏకంగా అధినాయకత్వం వద్దకు వచ్చారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.
అభిప్రాయాలను...
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై అధిష్టానం ఆరా తీస్తుంది. ఇటీవల చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భార్య కవిత ఆత్మహత్యాయత్నం ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే పనితీరు, వ్యవహార శైలిపై నియోజకవర్గంలో అధిష్టానం విచారణ జరిపింది. టీడీపీ కాల్ సెంటర్ నుంచి కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై నియోజకవర్గ ప్రజలకు ఫోన్ కాల్స్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అందరినీ కలుపుకొని వెళ్తున్నారా? లేదా? అంటూ ప్రశ్నలు అడుగుతూ కాల్స్ చిట్యాల సర్పంచ్పి వ్యాఖ్యలను సమర్థిస్తారా? అంటూ ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. తిరువూరు, ఎ. కొండూరు, విస్సన్నపేట, గుసల గూడెం మండలాలకు చెందిన ముఖ్య నాయకులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యే పనితీరు గురించి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం చర్యలను ప్రారంభించింది.


Tags:    

Similar News