హీట్ పెంచుతున్న తుపాన్.. ఈ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు
మరో మూడు రోజులపాటు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రానున్న మూడురోజుల్లో..
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుపాను ప్రభావం గుజరాత్ తో పాటు 8 రాష్ట్రాలపై ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. రేపు (జూన్15) సాయంత్రానికి గుజరాత్ వద్ద తీరందాటే అవకాశం ఉందని, ఆ సమయంలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే 47 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కచ్, సౌరాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
బిపోర్ జాయ్ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై మరో విధంగా పడుతోంది. తుపాను కారణంగా ఏపీలోకి ఈ సమయానికే విస్తరించాల్సిన రుతుపవనాలు నెమ్మదించాయి. ఏపీ, తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు తీవ్రమయ్యాయి. మరో మూడు రోజులపాటు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రానున్న మూడురోజుల్లో 43 - 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ 43 - 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వెల్లడించింది.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే రుతుపవనాలు విస్తరించగా.. కర్ణాటక బోర్డర్ జిల్లాలైన అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సాయంత్రం సమయంలో వర్షాలు కురవవచ్చని వెల్లడించింది. బిపార్ జోయ్ తుపాను తీరం దాటిన మూడు రోజుల తర్వాత వీక్ అవుతుందని, ఆ తర్వాతే రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని స్పష్టం చేసింది. జూన్ 19తేదీకి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలున్నట్లు తెలిపింది.