YSRCP : వైసీపీ నేతలు నియోజకవర్గాల్లో లేరట.. ఎక్కువ మంది కొన్ని రోజులు అక్కడే మకాం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు దాటుతుంది. పదకొండు మంది మినహా వైసీపీ నేతలు అందరూ ఓటమి పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు దాటుతుంది. పదకొండు మంది మినహా వైసీపీ నేతలు అందరూ ఓటమి పాలయ్యారు. అయితే ఎక్కువ మంది నేతలు ఇప్పుడు నియోజకవర్గాల దూరంగా ఉంటున్నారు. తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల నుంచి కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేస్తున్నారు. కొద్ది మంది నేతలు అంటే పదిశాతం మంది మినహా చాలా మంది నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే కేవలం ఓటమి బాధ నుంచి బయట పడటానికి కుటుంబ సభ్యులతో కలసి వారు బయటకు వెళ్లారని తెలిసింది. ఎక్కువ మంది వైసీపీ నేతలు హైదరాబాద్ లోనే ఉన్నారని చెబుతున్నారు.
కౌంటింగ్ కు ముందు...
ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతుండటంతో అప్పటి వరకూ ప్రచారంలో మూడు నెలల పాటు కష్టపడిన నేతలు కొద్ది రోజుల పాటు సేదతీరడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చారు. కొందరు విదేశాలకు వెళ్లి రాగా, మరికొందరు పర్యాటక ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో వెళ్లి అలా సేదతీరి వచ్చారు. కౌంటింగ్ జరిగే తేదీకి నాలుగైదు రోజులు ముందు తిరిగి నియోజకవర్గాలకు చేరుకున్నారు. అయితే ఈసారి కౌంటింగ్ తర్వాత జరిగిన ఓటమిని తట్టుకోలేక ఐదో తేదీ నుంచి చాలా మంది నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్లారని చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. నేత ఎప్పుడు వస్తారన్న సమాచారం కూడా తమకు తెలియదని సిబ్బంది చెబుతున్నారట.
హైదరాబాద్ లో ఎక్కువగా...
కార్యకర్తలకు అందుబాటులో లేకుండా వెళ్లడంపై కొందరు అక్కడే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది వైసీపీ నేతలు హైదరాబాద్ లో ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ నేతల్లో దాదాపు 80 శాతం మందికి వ్యాపారాలున్నాయి. హైదరాబాద్ లో ఇళ్లున్నాయి. దీంతో ఓటమి తర్వాత తమ వ్యాపారాలపై దృష్టిపెట్టేందుకు కొందరు హైదరాబాద్ వెళ్లారంటున్నారు. మరికొందరు బెంగళూరుకు వెళ్లారని చెబుతున్నారు. వైసీపీ మాత్రమే కాదు ఏపీ రాజకీయ నేతలు ఎక్కువ మంది హైదరాబాద్, బెంగళూరుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులను కూడా అక్కడే ఉంచి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వీళ్లంతా ఓటమి పాలు కావడంతో తిరిగి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లి తమ వ్యాపారాల్లో నిమగ్నమయ్యారని తెలిసింది. దీంతో ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు వారి కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గాలకు వచ్చి పార్టీ బలోపేతానికి పని చేయాలని క్యాడర్ కోరుతుంది.