Ys Jagan : జగనూ ఈ రెడ్ల గోలేంటి? ఇక వదలవా?
వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలిలో మార్పు రావడం లేదు. నిర్ణయాలన్నీ వివాదంగా మారుతున్నాయి
వైఎస్ జగన్ మొండితనాన్ని వీడటం లేదు. ఎవరేదైనా అనుకుంటారన్న స్పృహ లేదు. తాను అనుకున్నదే జరగాలనుకునే మనస్తత్వం. అది రాజకీయాల్లో పనికి రాదు. పట్టువిడుపులుండాలి. బయటకు కనిపించేది ఒకటి. లోపల జరిగేది ఒకటి రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ వైఎస్ జగన్ మాత్రం జనాలు ఏమనుకుంటారన్నది మాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను తిరిగి అందలం ఎక్కిస్తాయని పిచ్చి కలలు కంటున్నట్లుంది. అందుకే జగన్ జగమొండిలా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సరే.. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు కూడా జగన్ తన తీరు మార్చుకోవడం లేదన్న విమర్శలు పార్టీ నుంచే విమర్శస్తున్నాయి.
ఆధిపత్యం రెడ్లదే....
పార్టీలో ఆధిపత్యం ఎక్కువగా రెడ్లదే నడుస్తుంది. ఎందుకంటే ఎస్‌సి నియోజకవర్గాలు కానీ, మిగిలిన నియోజకవర్గాల్లో వారు చెప్పినట్లు నడవాల్సిందే. జగన్ నోటి నుంచి వచ్చేది వేరు. జరిగేది వేరు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ నినాదం మాత్రమే జగన్ చేస్తారు. కానీ పెత్తనమంతా రెడ్డి గార్లదే. రాయలసీమ రెడ్డి మనస్తత్వం, ఆ పోకడ జగన్ కు పోయినట్లు లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఇప్పుడు ఏపీ మొత్తానికి ప్రతిపక్షం అని తాను భావించడం లేదట్లుంది. అందుకే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను తీసుకునే నిర్ణయాన్ని ఎవరికీ చెప్పరు. ఎవరితో సంప్రదించరు.
ఒకరిని దగ్గరకు తీసుకుని...
అంతా తాను అనుకున్నట్లే జరగాలి. తనకు నమ్మకమైన వాళ్లను పార్టీ పదవుల్లో నియమించాలని భావిస్తారు కానీ, ఆ ప్రభావం మిగిలిన సామాజికవర్గాల పై ఎఫెక్ట్ పడుతుందని ఆయన ఊహించనూ లేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సామాజికవర్గాలను దగ్గరకు తీసుకుని మిగిలిన వారికి దూరమయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వర్గాన్ని దగ్గరకు తీసుకుని మిగిలిన సామాజికవర్గాలకు దూరమవుతున్నట్లే కనిపిస్తుంది. ఇలాగే పార్టీ అధినేత తీరు కొనసాగితే రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది దేముడెరుగు.. మొన్న వచ్చిన ఆ పదకొండు స్థానాలు కూడా దక్కడం కష్టమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
సమన్వయ కర్తలను..
తాజాగా పార్టీకి జిల్లాలలకు సమన్వయ కర్తలను నియమించారు. అందరూ రెడ్లతో నింపేశారు. అందరూ తన బంధువులు, సన్నిహితులకే పదవులు కట్టబెట్టారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాకు మిథున్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు విజయసాయిరెడ్డి, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిలను నియమించారు. ఆ బొత్స ఒక్కరే కాపు సామాజివకర్గం. మిగిలిన వాళ్లంతా రెడ్లే. గతంలో చేసిన తప్పులే జగన్ మళ్లీ చేస్తున్నాడని, ఇలాగయితే పార్టీ బలోపేతం కావడం కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.