Ys Jagan : జగన్ జాతకం మారేదెన్నడో.. వైసీపీలో హాట్ టాపిక్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకపోవడంపై నేతల మధ్య చర్చ జరుగుతుంది.

Update: 2024-09-23 08:06 GMT

YS JAGAN

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకపోవడంపై పార్టీలో నేతల మధ్య చర్చ జరుగుతుంది. ఓటమి తర్వాత నేతలు ఓపెన్ అయిపోతున్నారు. జగన్ ఇలాగే వ్యవహారశైలి కొనసాగిస్తే పార్టీ ఎదగడం కష్టమేనని అంటున్నారు. ఎన్నికల వేళ తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకుని ఇప్పటికైనా నేతలకు పట్టున్న నియోజకవర్గాల్లో వారిని ఇన్‌ఛార్జులుగా నియమిస్తే క్యాడర్ ను కాపాడుకుంటారని చెబుతున్నారు. కానీ జగన్ కు మాత్రం ఇగో అడ్డం వస్తున్నట్లుంది. అందుకే ఆయన నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల నియామకంపై ఎలాంటి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. జిల్లా అధ్యక్షులను మాత్రమే నియమిస్తూ మళ్లీ నేతలపై పెత్తనానికి కొందరిని వదులుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు...
ఎన్నికలకు ముందు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలను అనేక మందిని నియోజకవర్గాలను బదిలీ చేశారు. ఒకరి నియోజకవర్గాలకు వేరే వారిని అప్పగిస్తూ టిక్కెట్లను కేటాయించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో జగన్ వ్యూహం బెడిసి కొట్టింది. కేవలం పదకొండు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినా ఫలితం లేదు. వారిపై వ్యతిరేకత ఉందని మార్చారనుకున్నారు కానీ, తన ప్రభుత్వంపై ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత ఉందని ఊహించ లేకపోయారు. అంచనా ఊహకు కూడా అందకపోవడంతోనే జగన్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అంతా ఐప్యాక్ టీం చెప్పినట్లే చేశానంటూ చేతులు దులిపేసుకున్నారు.
అయిష్టంగానే వెళ్లి...
దీంతో అయిష‌్టంగానే ఆ నియోజకవర్గాలకు వెళ్లిన నేతలకు ఓటమి ఎదురు కావడంతో అక్కడ పార్టీని పట్టించుకోవడం మానేశారు. పాత వారు కూడా వదిలేశారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో క్యాడర్ అనాధలుగా మారిపోయారు. నేతలు లేక క్యాడర్ కూడా చెల్లాచెదురు కాకముందే అక్కడ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించాల్సిన అవసరం ఉందన్నది పార్టీ నేతల అభిప్రాయం. పాత వారికే తిరిగి అవకాశమిస్తే వారు తిరిగి ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తారంటున్నారు. కానీ జగన్ మాత్రం పార్టీని పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో నేతలు లేకపోవడంతో క్యాడర్ ను కూటమి ఎమ్మెల్యేలు లాగేసుకుంటున్నారు.
చేతులు ముడుచు కూర్చుంటే?
ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస పోటీ ఇచ్చేందుకు కూడా అవకాశముండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికీ వైసీపీని అభిమానించే క్యాడర్ అనేక మంది ఉన్నప్పటికీ వారికి అండగా నిలిచే నేత లేక డీలా పడిపోయింది. మరోవైపు అధికారంలో ఉన్నపార్టీ హామీలను అమలుపర్చకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి బయలుదేరింది. దానిని క్యాష్ చేసుకునేందుకు లీడర్లు అవసరం. కానీ జగన్ ఇలా కాలయాపన చేస్తూ వెళితే పార్టీ చేతుల్లో నుంచి చేజారిపోతుందన్న ఆందోళన నేతల్లో కనిపిస్తుంది కాని జగన్ లో మాత్రం వీసమెత్తు కనిపించడం లేదని, తిరిగి తనవల్లనే పార్టీ పుంజుకుంటుందన్న ధోరణిలో ఉన్నారంటున్నారు నేతలు. మరి జగన్ తీసుకునే నిర్ణయంపైనే పార్టీ ఆధారపడి ఉంటుందన్నది పార్టీ బలంగా వినిపిస్తున్న టాక్.


Tags:    

Similar News