Ys Jagan : తలరాతలు మార్చే ఎన్నిక ఇది.. ఆలోచించి ఓటేయండి
తలరాతలను మార్చే ఎన్నిక ఇది.. అందరు కలసి కట్టుగా కూర్చుని చర్చించుకుని ఓటు వేయాలని వైసీపీ అధినేత జగన్ పిలుపు నిచ్చారు
తలరాతలను మార్చే ఎన్నిక ఇది.. అందరు కలసి కట్టుగా కూర్చుని చర్చించుకుని ఓటు వేయాలని వైసీపీ అధినేత జగన్ పిలుపు నిచ్చారు. ఎర్రగుంట్లలో ప్రజలతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను వయసులో చాలా చిన్న వాడినని, ఇంత చిన్న వయసులో ఎవరైనా ఇన్ని పెద్దపనులను చేశారా? అని ప్రశ్నించారు. ఎర్రగుంట్లలో 98 శాతం మంది కుటుంబాలు ప్రభుత్వ పథకాలను పొందాయని తెలిపారు. తనకంటే ముందు ఒక 75 ఏళ్ల ముసలాయన పనిచేశాడని ఆయన ఏం చేశాడని జగన్ ప్రశ్నించారు. రైతులు, మహిళలు, విద్య, వైద్య రంగాల్లో అందరికీ ఫలాలు అందేలా చూడగలిగామని తెలిపారు.
సంక్షేమాన్ని...
రెండోరోజు కొనసాగుతున్న బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్లలో ప్రజలతో నేరుగా జగన్ మాట్లాడారు. ఈ యాభై ఎనిమిది నెలల్లో 2.75 లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందచేశామన్నారు. గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్దిదారులను ఎంపికను చేపట్టామని తెలిపారు. పార్టీలు, కులాలు, మతాలకు, ప్రాంతాలను చూడకుండా లబ్దిదారుల ఎంపిక జరిగిందని ఆయన అన్నారు. పూర్తి పారదర్శకతతో మీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. సంక్షేమాన్ని, సుపరిపాలనతో అందించామని జగన్ లబ్దిదారులకు వివరించారు. తనకంటే ముందు ఎందరో సీఎంలు పనిచేశారన్నారు.
పేదల పక్షిపాతిని...
కానీ తాను పేదల పక్షపాతినని ఆయన చెప్పుకొచ్చారు. మార్పు ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించమని కోరారు. తాను చెప్పానని కాదని, మీ ఇంట్లో కూర్చుని అందరూ మాట్లాడుకుని ఓటు విషయంలో ఒక నిర్ణయానికి రావాలని జగన్ కోరారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చి పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించగలిగామన్న తృప్తి మనకు ఉందన్నారు. అలాగే వైద్య రంగంలో కూడా విన్నూత్న మైన మార్పులు తెచ్చామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచడమే కాకుండా, ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపిందన్నారు. రానున్న కాలంలోనూ మరింత సంక్షేమాన్ని మీముందుంచడానికి తనకు అవకాశమివ్వాలని కోరారు.