తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలు దాటడం విశేషం.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 15 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 73,796 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,840 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలు దాటడం విశేషం. జులై 10న కూడా తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. సుమారు రెండు నెలల తర్వాత స్వామివారి హుండీకి రూ.5.11 కోట్ల ఆదాయం వచ్చింది. జులై 18న శ్రీవారి హుండీకి 5.40 కోట్ల ఆదాయం సమకూరింది. 15 రోజుల తర్వాత హుండీ ఆదాయం మూడోసారి 5 కోట్ల మార్క్‌కు చేరింది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా రూ.వంద కోట్ల మార్కును దాటేస్తోంది. గతేడాది మార్చి నుంచి ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్లకుపైగా వస్తోంది. జూన్‌లో రూ.116.14 కోట్ల ఆదాయం వచ్చింది.
ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను జూలై 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 26న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.