తిరుమలలో రద్దీ.. నడకమార్గాల్లో దుకాణదారులకు కీలక సూచనలు

నడ‌క మార్గాల్లో క్రూర‌మృగాల క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా దుకాణదారుల‌కు

Update: 2023-08-19 02:02 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శనివారం నాడు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 61,904 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నడ‌క మార్గాల్లో క్రూర‌మృగాల క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా దుకాణదారుల‌కు టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు దుకాణాల నిర్వాహ‌కుల‌తో ఈవో శుక్ర‌వారం స‌మావేశం నిర్వ‌హించి ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. న‌డ‌క‌మార్గాల్లో విక్ర‌యాల‌కు సంబంధించి అట‌వీ, ఎస్టేట్‌, ఆరోగ్య‌శాఖ‌ల అధికారుల‌తో పాటు ప‌లువురు భ‌క్తులు ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు చెప్పారు. అలిపిరి న‌డ‌క మార్గంలో వందకు పైగా తినుబండారాలు విక్ర‌యించే దుకాణాలు ఉన్నాయ‌ని, వీటిలో ఇక‌పై పండ్లు, కూర‌గాయ‌లు విక్ర‌యించ‌రాద‌ని సూచించారు. భ‌క్తులు వీటిని కొనుగోలు చేసి జంతువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల వాటి రాక పెరుగుతోంద‌ని, ఈ జంతువుల కోసం క్రూర‌మృగాలు అటువైపు వ‌చ్చి భ‌క్తుల‌పై దాడి చేస్తున్నాయ‌ని అన్నారు. అన్ని దుకాణాల వ‌ద్ద త‌డి చెత్త‌ను, పొడి చెత్త‌ను వేరువేరుగా చెత్త‌కుండీల్లో వేయాల‌ని, అలా చేయ‌ని వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. న‌డ‌క మార్గంలో రోజుకు రెండు నుండి మూడు ట‌న్నుల చెత్త పోగ‌వుతోంద‌ని, వీటిని ఆరోగ్య శాఖ సిబ్బంది క్ర‌మం త‌ప్ప‌కుండా తొల‌గిస్తున్నార‌ని చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సిసికెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తినుబండారాల దుకాణదారులు ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌న్నారు. క్రూర‌మృగాల జాడ క‌నిపిస్తే వెంట‌నే తెలిపేందుకు వీలుగా అట‌వీ, ఆరోగ్య‌, విజిలెన్స్ విభాగాల అధికారుల ఫోన్ నంబ‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తామ‌ని తెలిపారు.


Tags:    

Similar News