తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. స్వామివారి దర్శనం కోసం కేవలం ఒక కంపార్ట్‌మెంటులో
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. స్వామివారి దర్శనం కోసం కేవలం ఒక కంపార్ట్‌మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 62357 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరగనుంది. రేపు సాయంత్రం మాడ వీధుల్లో స్వామివారు విహరించనున్నారు.
సెప్టెంబరు 17న ఆదివారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.