తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
నేడు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం ఘనంగా
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. శనివారం తిరుమల వేంకటేశ్వరుడిని 78,115 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 38,243 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
నేడు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.