తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
శనివారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శ్రీవారి టోకెన్ రహిత
శనివారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 72,158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.08 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు స్వామివారికి 30,735 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలకు వచ్చిన అత్యాధునిక తాళపత్ర స్కానర్
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక తాళపత్ర స్కానర్‌ను శుక్రవారం టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవితో కలిసి ప్రారంభించారు. ఈవో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర తాళపత్ర పరిశోధన సంస్థ దేశంలోనే అతిగొప్ప సంస్థగా ఎదగాలని, టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. తాళపత్రాల్లో దాగి ఉన్న రహస్యాలను అందరికీ అందించాలని, ఇందుకోసం ఈ స్కానర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సంస్థ దేశంలోనే ప్రసిద్ధ తాళపత్ర పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, రిజిస్ట్రార్ డా. ఏ.వి.రాధేశ్యామ్, డీన్లు గోలి సుబ్రహ్మణ్య శర్మ, డా. ఫణియాజులు, తాళపత్ర విభాగాధిపతి విజయలక్ష్మి, పీఆర్వో డా. టి.బ్రహ్మాచార్యులు సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు.
తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులకు శుక్రవారం నిర్వహించిన పూజల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. పూజలు చేసిన అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన మ్యూజియాన్ని సందర్శకులను ఆకట్టుకునేలా ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమను, ఆలయ పురాతన సంప్రదాయాలు, సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను యాత్రికులకు తెలియజేయడమే మ్యూజియం ప్రధాన లక్ష్యమన్నారు. యాత్రికులకు ఇక్కడ శ్రీవారి ఆలయ సందర్శన దివ్యానుభూతిని అందిస్తామన్నారు. విరాళం ప్రాతిపదికన రూ.145కోట్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చినందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మ్యాప్ సిస్టమ్స్ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 19 గ్యాలరీలు ఉన్నాయని, వాటిలో ఐదింటిని బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ రూ.20 కోట్లతో, మిగిలిన 14 గ్యాలరీలను టిసిఎస్ రూ. 125 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయని చెప్పారు. ఈ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని తెలియజేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో తిరువీధులు, తిరుమల ఆలయ అనుభూతి, వాహన సేవలు, స్వామివారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఉన్నాయని, వీటిని బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మిగిలిన గ్యాలరీలను టిసిఎస్ సంస్థవారు ఆధునీకరణ చేస్తున్నారని వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో శ్రీ వేంకటేశ్వరుడి రాతి విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, దారు విగ్రహాలు, అన్నమయ్య రాగి రేకులు, పురాతన నాణేల గ్యాలరీలు ఉన్నాయన్నారు. మొదటి ఫ్లోర్ లో శ్రీవారి ఆలయ శిల్పకళా వైభవం, భక్తాగ్రేసరులు- వారి సేవలు, యుద్ధ పరికరాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి గ్యాలరీలు వంటి అనేక అద్భుతాలు కొలువుతీరి భక్తులను అబ్బురపరిచేలా తీర్చిదిద్దుతామన్నారు. రెండవ ఫ్లోర్‌లో విరాట్ పురుషుడు, బ్రహ్మ, మహేశ్వరులు, ఋగ్వేదం యజుర్వేదం గ్యాలరీలు ఉన్నాయని, మూడో ఫ్లోర్‌లో బ్రహ్మాండ గ్యాలరీ కొలువై ఉందని చెప్పారు. మ్యూజియం పైభాగంలో 17 పెద్ద గోపురాలు ఉన్నాయని, వీటిలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, శ్రీ పురందరదాస, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ శంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వంటి భక్తాగ్రేసరులతో పాటు రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి మహాగ్రంథాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను ప్రదర్శిస్తామని వివరించారు. మరుగున పడిన సనాతన ధార్మిక అంశాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు మ్యూజియం ఎంతగానో దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు టీటీడీ ఈవో ఎస్వీ మ్యూజియం నిర్మాణ ప్రణాళిక, డిజైన్‌ను డిస్‌ప్లే ద్వారా ఛైర్మన్‌కు వివరించారు.