తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
డయల్ యువర్ ఈవో కార్యక్రమం జూలై 16వ తేదీ ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం 71,472 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల వసంత మండపంలో జరుగుతున్న షోడశదిన కిష్కింధాకాండ పారాయణదీక్ష జూలై 15న శనివారం ముగియనుంది. ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు వసంతమండపంలో పారాయణం జరుగుతుంది. “మారుతస్య సమోవేగే గరుడస్య సమోజవే” అనే శ్లోకంలో చివరి అక్షరానికి సూచికగా చివరి రోజు 4 సర్గలను పండితులు పారాయణం చేస్తారు. వసంత మండపంలో 16 మంది వేద పండితులు శ్లోకాలను పారాయణం చేస్తున్నారు. అదేవిధంగా, ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
డయల్ యువర్ ఈవో కార్యక్రమం జూలై 16వ తేదీ ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261 అని టీటీడీ తెలిపింది.