తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శుక్రవారం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 66,977 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,020 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుక గల గోవిందరాజస్వామి సత్రాల్లో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరగనుంది. ఈ మూడు రోజుల పాటు ఉదయం భజన మండళ్లతో సుప్రభాతం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం సంగీత విభావరి, ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. జూలై 10న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు.